Srisailam | శ్రీశైల మహాక్షేత్రం ఆధ్వర్యంలో నిత్యం ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం దేవస్థానం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి తొమ్మిది రోజుల ‘గణపతి గాథలు’ ప్రవచనాలు శనివారం ప్రారంభం అయ్యాయి. ఆదివారం రెండో రోజు ప్రవచనాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలన చేశారు. తదుపరి ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మ మాట్లాడుతూ ఓంకారమే గణపతి ఆకారం ధరించిందని వేద పురాణాలు తెలియజేస్తున్నాయన్నారు.
అన్ని మంత్రాలకు గణపతి అధిపతి అని ముద్గల పురాణం చెబుతున్నదని సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. పలు సమయాల్లో వేర్వేరు విఘ్నాలను నివారించడానికి గణపతి అనేక రూపాలు ధరించాడని తెలిపారు. ఆ రూపాలే గణపతి అవతారాలుగా గణేశ సంబంధిత పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. గణపతి తత్త్వాన్ని ఆగమాలు, అనేక పురాణాలు విశేషంగా వివరించాయన్నారు.
గకారంతో మొదలయ్యే గణపతి నామాలు ఆ స్వామి వివిధ రూపాలను తెలుపుతాయని సామ వేదం షణ్ముఖ శర్మ తెలిపారు. అన్ని సంప్రదాయాల వారికి గణపతి ఉపాసనా దేవత అని చెప్పారన్నారు. గణపతిని అర్పించి ఆరాధించే వారిని గాణపత్యులంటారన్నారు. సర్వ విఘ్నహరుడిగా గణపతి ప్రసిద్ధికెక్కాడన్నారు. శ్రీశైల సంబంధిత గణపతి గాథలను, క్షేత్ర వైభవాన్ని, సనాతన ధర్మ, వైదిక ఆచారాలకు సంబంధించిన పలు అంశాలనూ వివరించారు.