Srisailam CI Prasada Rao | ఈ నెల 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలంలోని సత్రాల నిర్వాహకులతో శ్రీశైలం సీఐ ప్రసాదరావు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి సత్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని సత్రాల నిర్వాహకులకు చెప్పారు. సత్రాలు వారు భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎక్కువ మొత్తం డిమాండ్ చేయరాదని హెచ్చరించారు.
సత్రాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జూదం, మద్యం తాగడం, మాంసం తినడం చేయకూడదని శ్రీశైలం సీఐ ప్రసాదరావు చెప్పారు. సత్రాల్లో వేరే రాష్ట్రాల వ్యక్తుల పనిచేస్తే వారి పూర్వపరాలు, తనిఖీ చేసుకోవాలని సత్రాల నిర్వహాకులకు సూచించారు. అలాగే సత్రాల్లో రూమ్ చార్జీల పట్టిక డిస్ప్లే చేయాలన్నారు.. దేవస్థానం పరిసరాల్లో చేయతగిన పనులు, చేయకూడని పనులు తెలియచేస్తూ డిస్ప్లే ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. సత్రాల్లో దళారీ వ్యవస్థ ఉండకూడదని, సత్రాల్లో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు ఏర్పాటు చేయకూడదని, సత్రాల్లో ఎలాంటి గొడవలు జరిగినా సత్రాల నిర్వాహకులదే బాధ్యత అని చెప్పారు.