శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో జరిగిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Srisailam Brahmotsavam) పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం వల్ల విజయవంతంగా ముగిసాయని ఆత్మకూర్ డీఎస్పీ రామంజి నాయక్ (DSP Ramanji Naik) వెల్లడించారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం , డీజీపీ, తదితర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహా శివరాత్రికి (Maha Shivratri ) ప్రణాళికబద్ధంగా బందోబస్తు నిర్వహణ చేపట్టామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పలు సందర్భాల్లో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. బందోబస్తులో భాగంగా సుమారు 2,500 మంది పోలీసులు పాల్గొన్నారని వివరించారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించామని తెలిపారు.
అడిషనల్ ఎస్పీ, 13 మంది డీఎస్పీలు ( DSP), 80 మంది సీఐ ( CI ) లు, 160 మంది ఎస్సైలు, 2, 500 సివిల్ పోలీసులు, 120 మంది ఆర్మ్డ్ పోలీసులు , ఏపీఎస్పీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేశాయని తెలిపారు. మున్నెన్నడూ లేనివిధంగా ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 800 సీసీ కెమెరాలతో పర్యవేక్షణ , 8 డ్రోన్లను వాడడం జరిగిందన్నారు. మహా శివరాత్రి వేడుకలను విజయవంతం చేసిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో సీఐలు ప్రసాద రావు , చంద్రబాబు పాల్గొన్నారు.