Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికులతో పుర వీధులన్నీ రద్దీగా మారాయి.
ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తరాది రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు లక్ష మందికి పైగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులే కాక ఏడువేలకు పైగా సొంత వాహనాలు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి 4000కి పైగా వాహనాలు శ్రీశైల క్షేత్రంలోకి వచ్చాయి. దీంతో వచ్చీపోయే వాహనాలతో శ్రీశైలం రింగ్ రోడ్డుతోపాటు ఆలయ పరిసరాలన్నీ స్తంభించాయి. ఆదివారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమైన వాహనాలు ఆరు గంటలకు పైగా 10 కి.మీ. మేర నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో వాహనాల రద్దీని నివారించేందుకు దేవస్థానం, పోలీసు శాఖ అధికారుల పనితీరు హర్షణీయం అని భక్తులు పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లో అడ్డగోలుగా పార్కింగ్ చేయకుండా రింగ్‌రోడ్డును లింక్ చేస్తూ ప్రధాన కూడళ్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో శ్రీశైలం పట్టణ వీధులన్నీ పద్మ వ్యూహాన్ని తలపించాయి.
కార్తీకమాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామ స్మరణతో మార్మోగింది. వరుసగా వారాంతపు సెలవులు కలిసి రావడంతో యాత్రికులు కుటుంబసమేతంగా క్షేత్రానికి చేరుకున్నారు. తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకొన్నారు.అటుపై క్యూలైన్లలో నిలిచిన భక్తులకు స్వామి అమ్మవార్ల ఉచిత దర్శనానికి ఐదు గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటలు, అతిశీఘ్ర దర్శనానికి గంట సమయం పట్టింది.
సుమారు 70 వేల మందికి పైగా ఉభయ దేవాలయాల్లో దర్శనాలు చేసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారం అందిస్తున్నామని శ్రీశైలం పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.
కార్తీక మాసం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తుల్లో సగానికి పైగా కార్లు, ఫుట్పాత్లపైనా, దుకాణాలపైనా అర నిద్రలు చేశారు. తెల్లవారుజామునే ఉభయ దేవాలయాల్లో దర్శనార్థం తిరుగు ప్రయాణం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేవస్థానం ఈవో లవన్న ఆధ్వర్యంలో దేవస్థానం భద్రతాధికారి నర్సింహారెడ్డి, పోలీస్ ఇన్స్పెక్టర్ దివాకర్ రెడ్డి, ఎస్సై లక్ష్మణ రావు మైక్ ప్రకటనల ద్వారా ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. దేవస్థానం సిబ్బంది, పోలీసులు పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తించారు. హఠకేశ్వరం నుండి శిఖరం.., సుండిపెంట వరకు ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.