Srisailam | శ్రీశైలం : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆషాఢ మాసం సందర్భంగా శనివారం శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారు సారె సమర్పించారు. ఈవో, ఆలయ సిబ్బంది ఇంద్రకీలాద్రికి వెళ్లి కనకనదుర్గ అమ్మవారికి సారె అందించగా.. కనకదుర్గ అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చిన శ్రీశైలం దేవస్థానం ఈవో, ఆలయ అధికారులు, అర్చకులకు దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు.

పట్టుచీర, పూలు, పల రకాల ఫలాలు, గాజులను కనకదుర్గ అమ్మవారికి.. మల్లేశ్వరస్వామి వారికి పట్టువస్త్రాలను ఈవో డీ పెద్దిరాజు దంపతులు, భ్రమరాంబ అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు మార్కండేయ శాస్త్రి, ఏఈఓ హరిదాసులు, అర్చకులు, వేదపండితులు మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈవో కేఎస్ రామారావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు దంపతులతో పాటు పాటు సిబ్బంది దుర్గామల్లేశ్వరస్వామి వారలను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహామండపం 6వ అంతస్తులో దేవస్థానం ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం చేశారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను బహూకరించారు.