Srisailam | శ్రీశైలం : జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రంలో దసరా మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో రోజైన సోమవారం భ్రమరాంబ అమ్మవారు మహాగౌరి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. నందిని వాహనంగా చేసుకొని నాలుగు చేతుల్లో వర, అభయ ముద్రలతోపాటు త్రిశూలం, ఢమరుకాన్ని ఆయుధాలగా ధరించి దివ్యకాంతులను ప్రసరింపజేస్తూ తెల్లని రంగులో శాంతస్వరూపిణిగా భక్తులను అమ్మవారు కటాక్షించారు.
Srisailam Dasara Mahotsavam
నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా శాస్త్రాలు చెబుతున్నాయి. మహాగౌరి పార్వతిరూపంలో పరమశివుని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేసింది. ఈ తపస్సు కారణంగా ఆమె శరీరం నల్లగా మారుతుంది. ఆ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు అమ్మవారి శరీరంపై గంగాజలాన్ని చిలకరించాడు. అప్పుడు ఆ దేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారింది. అందుకే ఈ దేవి మహాగౌరిగా పిలుస్తారు. దసరా మహోత్సవాల ఎనిమిదో రోజున ఈ దేవిని పూజిస్తారు. ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశిస్తాయని. కష్టాలు తొలగిపోతాయని పురాణాలు పేర్కొంటున్నాయి.
Srisailam Dasara Mahotsavam
అక్క మహాదేవి అలంకారమండపంలో నందివాహనంపై ఆసీనులైన భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు రుత్వికులతో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం నందివాహనసేవ నిర్వహించారు. అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు అమ్మవారికి ఆస్థానసేవ, ఏకాంత సేవలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఉదయం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్టాలు, పారాయణలు, చండీహోమం, పంచాక్షరి, బ్రామరి, బాలా జపానుష్టాలు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారి పూజలు చేశారు.
Srisailam Dasara Mahotsavam
అలాగే, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు చేశారు. రాత్రి 9 గంటలకు కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీపూజలు చేసినట్లు ఆలయ అధికారులు వివరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం సైతం కుమారీ పూజలు కొనసాగాయి. రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజించడం జరుగుతుంది.
Srisailam Dasara Mahotsavam
నవరాత్రి ఉత్సవాల్లో కుమారి పూజకు ప్రాధాన్యం ఉంది. ఇదిలా ఉండగా.. నవరాత్రుల సందర్భంగా నిత్య కళారాధన వేదికపై గుంటూరు నటరాజ కళా కూచిపూడి డాన్స్ అకాడమి, తెనాలికి చెందిన వీ లక్ష్మీ సునీత బృందం నిర్వహించిన సంప్రదాయ నృతం, భక్తి విభావరి కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
Srisailam Dasara Mahotsavam