Srisailam | శ్రీశైలం : ప్రముఖ జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో బుధవారం నుంచి నవంబర్ 21 వరకు కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై ఎం శ్రీనివాసరావు సమీక్షించారు. సమీక్షలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, పాతాళగంగలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు, భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టలో ఏర్పాట్లు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, వైద్యఆరోగ్యసేవలు, వాహనాల పార్కింగ్, పారిశుధ్యం ఏర్పాట్లు మొదలైన అంశాల గురించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్తీకమాసంలో ప్రతీసోమవారం, కార్తీక పౌర్ణమి రోజున జరిగే పుష్కరిణి హారతి, లక్షదీపోత్సవం, పౌర్ణమినాటి జ్వాలాతోరణోత్సవం, 31వ కృష్ణమ్మ హారతి, నవంబర్ 14న జరిగే కోటి దీపోత్సవం, 18వ తేదీన జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రతీరోజు వేకువజామున 3గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ప్రాతఃకాలసేవలను జరిపించిన అనంతరం వేకువజామున 4.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు దర్శనాలుంటాయన్నారు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు కూడా దర్శనాలను కొనసాగించాలని చెప్పారు. సాధారణ భక్తులను దర్శనాలు కల్పించేందుకు వీలుగా కార్తీక మాసం మొత్తంలో గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శని, ఆది, సోమవారాలు, పర్వదినాలు కలిపి 16 రోజులపాటు అమ్మవారి అంతరాలయంలో నిర్వహించే కుంకుమార్చనలు ఆశీర్వచన మండపంలో నిర్వహించాలని చెప్పారు. రుద్రహోమం, చండీహోమం, సాక్షిగణపతి హోమం, నిత్యకల్యాణం మొదలైన ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగించాలన్నారు.
కాగా, క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యూకాంప్లెక్సులో అల్పాహారం, బిస్కెట్లు, మంచినీటిని నిరంతరం అందించాలని చెప్పారు. పర్వదినాల్లో క్యూలైన్లలో వేడిపాలను అందజేయాలన్నారు. ప్రతీరోజు ఉదయం 10.45 గంటల నుంచే అన్నప్రసాదవితరణను ప్రారంభించాలన్నారు. సాయంత్రం 7గంటల నుంచి భక్తులకు అల్పాహారం అందజేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఏడు ప్రసాదాల విక్రయకేంద్రాలకు అదనంగా రద్దీని బట్టి మరో మూడు నుంచి నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని లడ్డు ప్రసాదాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్తీకమాసంలో భక్తులు పుణ్యస్నానాలకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా పాతాళగంగ వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలన్నారు.
పాతాళగంగ వద్ద శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం, అదనపు లైటింగ్ ఏర్పాట్లు చేయడంతో పాటు గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండాలని చెప్పారు. భక్తులు సమాచారం తెలుసుకునేందుకు అవసరమైన అన్నీ ప్రదేశాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ ఉత్తరమాడవీధిలోనూ, ఆలయ ముందుభాగంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక దీపరాధనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను, జ్వాలాతోరణోత్సవాన్ని, కృష్ణమ్మహారతి కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించాలని.. అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన కోటిదీపోత్సవం, తెప్పోత్సవ కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు కోటిదీపోత్సవానికి, పాతాళగంగ వద్ద తెప్పోత్సవానికి ఆయా ఏర్పాట్లన్నీ ముందస్తుగానే పూర్తి చేయాలన్నారు. పోలీస్‌శాఖ సహకారంతో భద్రతా ఏర్పాట్లు చేయాలని.. వాహనాల క్రమబద్దీకరణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశం ఉభయదేవాలయాల ప్రధాన అర్చకులు, డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం నరసింహారెడ్డి, అన్నిశాఖల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.