తిరుపతి : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికులు, నగరవాసుల సౌకర్యార్థం తిరుపతి నగరంలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులను కోరారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని తన కార్యాలయంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, జేఈవో వీరబ్రహ్మం ఇతర అధికారులతో శ్రీనివాస సేతు పనుల పురోగతిపై ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈవో మాట్లాడుతూ మంగళం రోడ్డు నుంచి లీలామహల్ సర్కిల్ అప్రోచ్ రోడ్డు పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేయాలని కోరారు. లక్ష్మీపురం సర్కిల్ నుంచి రామానుజ సర్కిల్ వరకు జరుగుతున్న పనులను ఆగస్టు నెలలో పూర్తి చేయాలన్నారు.
రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రాస్ వద్ద నుంచి జరుగుతున్న పనులను మూడు వారాల్లో పూర్తిచేసి నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు.