తిరుపతి : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాలస్వామివారి అలంకారంలో చంద్రకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. కొవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు.
అనంతరం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేపట్టారు. వాహన సేవలో జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయులు, రమణయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు.