తిరుపతి: తిరుపతి శ్రీనివాసమంగాపురం( Srinivasamangapuram ) శ్రీవారి మెట్టు సమీపంలో ఉన్న శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవాన్ని ( Parveta Utsavam) గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి ఉత్సవమూర్తుల ఊరేగింపు ప్రారంభమై శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకుంది. అక్కడ క్షేమతలిగ నివేదన చేసి పార్వేట ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్టశిక్షణ కోసం స్వామివారు మూడు సార్లు బళ్లెంను ప్రయోగించారు.
ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువస్తారు . ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు. భజన బృందాలు భజనలు, కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏపీవో గోపినాథ్, తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.