అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ( Talliki Vandanam) పథకానికి విధివిధానాలు రూపొందించక ముందే విషప్రచారం మొదలు పెట్టారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు( Minister Nimmala Ramanaidu) ఆరోపించారు. విజయవాడలోని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నా అమ్మ ఒడి ఇస్తామని మడమ తిప్పింది జగన్(Jagan) కాదా అని ప్రశ్నించారు. పింఛన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనంను ఏ విధంగా అమలు చేయాలి. ఎప్పుటి నుంచి ప్రారంభించాలనే విషయంపై విధివిధానాల కసరత్తు చేస్తున్నామని వివరించారు. అబద్దాలకు, అసత్యాలకు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని విమర్శిం చారు.
కూటమి ఇచ్చిన హామీ మేరకు లబ్దిదారుల గడపకు వెళ్లి పింఛన్‌ను ఇచ్చామని వెల్లడించారు. దివ్యాంగులకు రూ.3వేలను రూ. 6 వేలు అందజేసామని తెలిపారు. మెగా డీఎస్సీని ప్రకటిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం డీఎస్సీపై పెట్టారని , ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్టు ( Land And Titling Act) ను రద్దు చేశామని తెలిపారు. ఐదేండ్లలో రూ. 40 వేల కోట్ల ఇసుకను దోపిడి చేశారని, కూటమి అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఉచిత ఇసుకను అందజేస్తున్నామని నిమ్మల తెలిపారు.