Srisailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో శ్రీగిరి దారులన్నీ రద్దీగా మారాయి. ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుండి వచ్చిన వేలాది మంది భక్తులతో క్షేత్రం సందడిసందడిగా మారింది.
అందులోను అమావాస్య కావడంవల్ల శనివారం తెల్లవారుజాము నుండి నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచిన తరువాత శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులుదీరారు. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పట్టగా శీఘ్ర దర్శనానికి గంటకుపైగా సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.
అధిక సంఖ్యలో దంపతులు సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు. ఆన్లైన్లో మాత్రమే ఆర్జిత సేవాటిక్కెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.