Srisailam | గురువారం సాయంత్రం త్రయోదశి ఘడియలు ప్రారంభం కావడంతో శ్రీశైల మహాక్షేత్రంలో నందీశ్వర స్వామి వారికి పరోక్ష సేవగా విశేషార్చన జరిపించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజుల్లో దేవస్థానం సేవ (సర్కారీ సేవ)గా ఈ కైంకర్యం జరిపిస్తున్నారు. ప్రతి నెలలోనూ త్రయోదశి నాడు.. అంటే శుద్ధ త్రయోదశి, బహుళ త్రయోదశి రోజుల్లో నందీశ్వర స్వామి వారికి పరోక్ష సేవగా విశేష పూజ నిర్వహించుకునే అవకాశాన్ని శ్రీశైలం దేవస్థానం కల్పించింది. ఈ రోజు నిర్వహించిన పరోక్ష సేవలో తెలుగు రాష్ట్రాలతోపాటు పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల భక్తులు కూడా విశేష పూజ నిర్వహించుకున్నారు.
ఈ పూజాదికాల్లో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహా గణపతి పూజ జరిపించారు. తదుపరి నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధ జలంతో అభిషేకం నిర్వహించారు. తర్వాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.పురుష సూక్తం, వృషభ సూక్తం తదితర వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని నిర్వహించారు. తదుపరి నందీశ్వర స్వామి వారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు జరిపించారు. అటుపై నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పిస్తారు. చివరగా స్వామి వారికి నివేదన సమర్పిస్తారు.
త్రయోదశి నాడు జరిపించే నందీశ్వర స్వామి వారి పరోక్ష సేవకు భక్తులు ఆన్ లైన్ ద్వారా రూ.1,116 సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపులు జరుప వచ్చు.
నందీశ్వర స్వామి వారి ఆరాధన వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని, రుణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు. అలాగే ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడంతో కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ స్వామి వారికి శనగల బసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.
ఈ పరోక్ష సేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించడానికి వీలుగా ప్రసారాల వివరాలు, ప్రసార సమయం తదితర వివరాలను ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలియజేస్తున్నట్లు దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు. సేవా కర్తలతోపాటు భక్తులంతా వీటిని శ్రీశైల టీవీ / యూ-ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు. కనుక భక్తులంతా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్ 83339 01351 / 52/ 53 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.