Srisailam | శ్రీశైల మహా క్షేత్ర పరిధిలో గల భారత్ పెట్రోల్ బంకు వద్ద గల శ్రీశ్రీశ్రీ మౌన స్వామి ఆశ్రమంలో లోక కళ్యాణం కోసం మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజులు విశేష పూజలు నిర్వహించారు. స్వామి వారి జీవ సమాధికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కళ్యాణం, మహా రుద్రచండి హోమం నిర్వహించారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలతో రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా ఉండాలని రాష్ట్ర, దేశ ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మూడు రోజులపాటు జరిగిన ఈ విశేష పూజలలో ఆశ్రమ భక్తులు, స్థానికులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుండి కూడా పలువురు భక్తులు పాల్గొన్నారు. భక్తులకు మూడు రోజులపాటు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఆశ్రమాధిపతి బసవరాజు స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మంజుల, అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి శ్రీశైల మండలం ఓబీసీ మహిళ అధ్యక్షురాలు సుమలత భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు. అంతేకాకుండా ఆశ్రమంలో జరిగే కార్యక్రమానికి సొంత నిధులను కేటాయించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సత్కరించారు.