Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో పుష్యమాసశుద్ధ ఏకాదశి సందర్భంగా ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్కమహాదేవి అలంకార మండపంలో సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. స్వామిఅమ్మవార్లకు ప్రీతికరమైన నూరు వరహాలు, గులాబీలు, చామంతులు, కాగడా మల్లెలు, జాజి విరజాజులు, గన్నేరు, కనకాంబరం, సంపంగి, తామర పుష్పాలతోపాటు బిల్వం, దవనం, మరువం వంటి 40 రకాల పూలను వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పూలతో పూజలు చేశారు.
సుమారు 4 వేల కేజీల పుష్పాలతో స్వామిఅమ్మవార్లకు జరిగే ఈ కార్యక్రమంలో వేదపండితులచే చతుర్వేద పారాయణం నిర్వహించారు. మల్లికాపుష్పాలతో పూజింపబడినందుకే స్వామివారికి మల్లికార్జునుడనే పేరు వచ్చిందని పురాణ ఇతిహాసాల్లో ఉన్నట్లు ఈవో తెలిపారు. అదే విధంగా యాగయాగాల నుంచి కరవీరుడు, పుష్పదంతుడు, చంద్రవతి వంటి మహనీయులైన భక్తులెందరో స్వామిఅమ్మవార్లకు పుష్పకైంకర్యాలు చేయగా అమ్మవారికి కూడా పుష్పార్చన ఎంతో ప్రీతికరమని పురాణాల్లో చెప్పబడుతున్నట్లు ఈవో తెలిపారు. ఈ పుష్పార్చనకు పుంగనూరుకు చెందిన రామచంద్రయాదవ్ పూలను విరాళంగా అందజేశారు.