తిరుపతి జిల్లా : తిరుమలలో విపత్తుల నివారణకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులను టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి కోరారు. తిరుమలకు నిత్యం 80 వేలకు పైగా భక్తులు వస్తుండటంతో రద్దీని క్రమబద్దీకరించడంతోపాటు తొక్కిసలాట, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో తిరుపతి జిల్లా, టీటీడీకి సంబంధించిన విపత్తుల నివారణ అనే అంశంపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యర్థి వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి పరంగా ఎదురయ్యే సవాళ్లను సాధ్యమైనంత వరకు ఎదుర్కోవడానికి ప్రణాళికలు రూపొందించడం అవసరమని తెలిపారు. తిరుమలలో 7,500 వసతి గదులతోపాటు అనేక వాణిజ్య సముదాయాలు ఉన్నాయని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను రూపొందించాలన్నారు. అలాగే, శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల తయారీకి గ్యాస్ వినియోగించే చోట ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలు తెలపాలన్నారు. అకస్మాత్తుగా సంభవించే భారీ వర్షాలు, పిడుగుల వలన కొండ చరియలు విరిగిపడటం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నదన్నారు. వేసవిలో శేషాచల అడవుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలు, వడగాలుల గురించి వివరించి.. ఇందుకు సంబంధించిన ఇబ్బందులను అధిగమించడానికి ఎన్డీఎంఏ ఆధ్వర్యంలో ఎస్ఓపీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఎస్డీఎంఏ జాయింట్ సెక్రెటరీ కునాల్ సత్యర్థి సానుకూలంగా స్పందించి టీటీడీకి సంబంధించిన అంశలపై నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో నిపుణులైన వారితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తిరుమలకు పంపుతామని హామీ ఇచ్చారు. దీనిపై త్వరలో ఒక వర్క్ షాప్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు, తిరుమల అదనపు ఎస్పీ మునిరామయ్య, ఏపీఎస్ డీఎంఏ అధికారులు నాగరాజు, శేఖర్ చతుర్వేది, తిరుపతి డీఆర్వో శ్రీనివాసరావు, తుడా సెక్రటరి శ్రీమతి లక్ష్మి, ప్రాంతీయ వాతావరణ అధికారి బాలచంద్ర, ఐఐటీ నిపుణులు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ వాహనసేవల్లో అపురూపమైన కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. టీటీడీ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఉత్తరాదితో పాటు దక్షిణాదికి చెందిన 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి కళాకారులు వాహనసేవల్లో పాల్గొననున్నారు. వాహనసేవల సమయంలో వాటి విశిష్టతను తెలియజేసేందుకు ప్రముఖ పండితులు వ్యాఖ్యానం చేస్తారు.
టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీవేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక, భక్తి సంగీత కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరితో పాటు మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి వివిధ కళారూపాలు ప్రదర్శించేందుకు కళాకారులు విచ్చేయనున్నారు. ఆయా రాష్ట్రాల కళాకారులు స్థానిక జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు.