Aadhaar Card | ఆధార్ ఇప్పుడు అందరికీ తప్పనిసరిగా మారింది. పెద్దవాళ్లకే కాదు.. చిన్న పిల్లలకు కూడా ఆధార్ అవసరమే. ఆధార్ కార్డు లేకపోతే స్కూళ్లలో అడ్మిషన్ల కూడా ఇవ్వడం లేదు. ఈ విషయంపై సరైన అవగాహన లేక పిల్లలను పాఠశాలలో చేర్పించే సమయంలో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. బడి ప్రారంభ సమయంలో ఆధార్ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అలా అందరూ ఒకే సమయంలో రావడంతో ఆధార్ సేవా కేంద్రాలు రద్దీగా మారుతున్నాయి. అప్పుడు ఆధార్ కార్డుల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం.. పుట్టిన చోటే శిశువులకు ఆధార్ కార్డులు జారీ చేసేలా చొరవ తీసుకుంది. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొంతకాలంగా ప్రత్యేకంగా శిశు ఆధార్ సేవా కేంద్రాలను నిర్వహిస్తోంది.
ప్రతి నెలా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ ఆధార్ ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంటాయి. ఇవి ఉచిత సేవలు అందిస్తాయి. పిల్లల బర్త్ సర్ట్ఫికెట్, తల్లి లేదా తండ్రి ఆధార్, బయోమెట్రిక్ వివరాలను సమర్పించడం ద్వారా ఈ కేంద్రాల్లో పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఏపీలో 11 లక్షల మంది చిన్నారులకు ఆధార్ లేనట్లు తెలిసింది. అలాగే ఆధార్ నమోదు చేసుకున్న వారిలోనూ 42.10 లక్షల మంది బయోమెట్రిక్ చేయించుకోలేదని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే పీహెచ్‌సీలు, అంగన్వాడీలు, గ్రామ సచివాలయాల్లో నిర్వహించే ప్రత్యేక శిశు ఆధార్ నమోదు కేంద్రాలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇక స్కూళ్లలోనే ఆధార్ కార్డు అప్‌గ్రేడేషన్
ఐదేళ్లు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇలా ఐదేళ్ల వయసు దాటిన తర్వాత ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకోని చిన్నారులు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల మందికిపైగా ఉన్నట్లు యూఐడీఏఐ తాజాగా వెల్లడించింది. అలాంటి వారికోసం యూఐడీఏఐ కొత్త వెసులుబాటు తీసుకొస్తోంది. పిల్లలు చదువుకునే స్కూళ్లలోనే ఆధార్ అప్డేషన్ చేసే విధంగా ఒక ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఇటీవల యూఐడీఏఐ సీఈవో భువనేశ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ మెషిన్లను పంపించి, ప్రతి పాఠశాలలో ఆధార్ అప్డేషన్ ప్రక్రియను అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి స్కూల్‌కు వెళ్లి ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసేందుకు కావాల్సిన టెక్నాలజీని పరీక్షిస్తున్నామని.. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారు.
పిల్లలకు ఆధార్ కార్డు ఎలా అప్లై చేయాలి
యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోని మై ఆధార్ విభాగంలోకి వెళ్లాలి. అందులో బుక్ మై అపాయింట్మెంట్ ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మన సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాలను ఎంచుకుని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకున్న టైమ్‌లో తల్లిదండ్రులు పిల్లలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పిల్లల బర్త్ సర్టిఫికెట్తో పాటు తల్లి లేదా తండ్రి ఆధార్, బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌తో తెలియకపోతే నేరుగా సమీపంలోని ఆధార్ కేంద్రాలకు నేరుగా వెళ్లి సంబంధిత ఆధార్ ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తే సరిపోతుంది. ఐదేళ్ల లోపు పిల్లలు అయితే నీలిరంగు ఆధార్ (బాల ఆధార్) ఇస్తారు. దీనికి పిల్లల బయోమెట్రిక్ వివరాలు తీసుకోరు. కానీ ఐదేళ్ల తర్వాత మాత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలు సమర్పించి ఆధార్ కార్డు అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుంది.