ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని వెల్లడించింది. ఫలితంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలోనూ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించింది.
వాతావరణం ఒక్కసారిగా మారి బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో మచిలీపట్నంలో 2 సెంటీమీటర్లు, కొవ్వూరులో 2, చంద్రగిరిలో 2, అల్లవరంలో 1, మామిడికుదురులో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. కోస్తా, రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు కురిశాయని, ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.
కాగా, సంక్రాంతి సందర్భంగా రెండు మూడు రోజులుగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చితోపాటు మరికొన్ని పంటలు ఇప్పటికే నాట్లు వేశారు. మళ్లీ ఇప్పుడు వర్ష సూచనతో అప్రమత్తమైన రైతులు పొలాల్లోనే తమ పంటలను సంరక్షించుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.