అమరావతి : చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఆరుగురు మృతి చెందారని మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఆరోపించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఘోర ప్రమాదం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘటనలో ఆరుగురు చనిపోవడం బాధాకరమని అన్నారు.
తక్షణమే విచారణ జరిపి బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా వారిపై చర్యలు ( Action) తీసుకుంటేనే మరణించిన వారి ఆత్మలు శాంతిస్తాయని పేర్కొన్నారు. తిరుమల కొండపై వివాదాలు సృష్టించి, రాజకీయంగా వైసీపీని అణచివేసేందుకు టీటీడీ చైర్మన్,(TTD Chairman) ఈవో , జేఈవో ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వీరికి భక్తులకు సేవ చేయాలనే దృక్ఫథం లేదని విమర్శించారు.
వైకుంఠ ఏకాదరి ( Vaikunta Ekadasi) ఏర్పాట్లపై కిందిస్తాయి సిబ్బంది సూచనలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికారుల తప్పిదం, మానవ లోపంతోనే తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. చైర్మన్ బీఆర్ నాయుడికి దేవుడి మీద భక్తి లేదని, వైసీపీ మీద పూర్తిగా విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
కొండ మీద రాజకీయాలు చేసి జగన్ను అడ్డుకునే ప్రయత్నాలే చేశారని ఆరోపించారు. కొండ మీద పాపాలు, ద్వేషాలు కొనసాగితే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని అన్నారు. ఎస్పీ సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీ సేవలో ఉన్నారని ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కాపాడే యోధుడిగా చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్ ఈ ఘటనపై ఏం సమాధానం చెప్తారని అన్నారు.