ప్రకాశం: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. 16వ నంబర్ జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందారు. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందారు. అయితే బోల్తా పడిన లారీని మరో లారీ ఢీకొట్టడంతో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఆ ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారును వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఘటనలో లారీ బోల్తాపడి డ్రైవర్ మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారు ప్రమాదంలో మరణించినవారిని పావని (25), కౌశిక్ (14)గా గుర్తించారు. వారు గుంటూరు జిల్లా నుంచి తిరుమలకు వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు.