Punganur | ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో దుండగులు విధ్వంసం సృష్టించారు. రాత్రికి రాత్రే ఇండోర్ షటిల్ కోర్టు భవనాన్ని కూల్చివేశారు. ఆదివారం ఉదయం క్రీడాకారులు వచ్చేసరికి స్టేడియం నేలమట్టం కావడం చూసి ఆందోళన చెందారు. దాదాపు కోటి రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న షటిల్ కోర్టును కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన వారు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలిని మాజీ ఎంపీ రెడ్డప్ప పరిశీలించారు.
ఇండోర్ స్టేడియాన్ని టీడీపీ నేతలే కూల్చివేశారని వైసీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి అనుకూలంగా పనిచేశారనే కక్షతోనే ఈ విధ్వంసం సృష్టించారని చెబుతున్నారు. కాగా, ఏపీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల దాడులు పెరిగిపోయాయి. వైసీపీకి ఓటు వేసిన వారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని, ఆస్తులను ధ్వంసం చేస్తుందని వైసీపీ ఎప్పట్నుంచో ఆరోపిస్తూనే ఉంది.
తాజాగా వైఎస్సార్ జిల్లా పులివెందులలో కూడా 20 ఏళ్ల యువకుడిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. దీంతో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేవని గుర్తుచేశారు. పులివెందుల చరిత్రలో ఇలాంటి సంప్రదాయం లేదని అన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఆయన పాపాలు కూడా పండుతున్నాయని చెప్పారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని గుర్తు చేశారు. అధికారం మారిన రోజున ఆ పాపాలు తనకే చుట్టుకుంటాయని చంద్రబాబు గుర్తించాలని హెచ్చరించారు. ఈ సంస్కృతిని ఆపేయాలని చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా అని.. ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు. వైసీపీ శ్రేణులపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తానని తెలిపారు.