హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు పట్టువదలని విక్రమార్కుడిలా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పోరాడిన రఘురామ.. ఆయన ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ కేసులను సీబీఐ, ఈడీ సక్రమంగా దర్యాప్తు చేయలేదని, దీనిపై విచారణ చేయాలని రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే, రఘురామ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు హైకోర్టు కార్యాలయం అనేక అభ్యంతరాలను వ్యక్తపరిచింది. తాజాగా ఆ అభ్యంతరాలను పరిశీలించిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ పిటిషన్‌కు నంబరు కేటాయించాలని సూచించిన ధర్మాసనం.. వాదనలను వినకుండా ఉత్తర్వులు ఎలా జారీ చేయాలని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను ధర్మాసనం తోసిపుచ్చింది. దాంతో జగన్‌పై మరోసారి రఘురామ విజయం సాధించినట్లయింది.
మరోవైపు, ఏపీ పోలీసులు తనపై నిఘా పెట్టారని రఘురామ ఇచ్చిన ప్రివిలైజ్ నోటీసుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద ఏపీ సీఐడీ విభాగం నిఘా పెట్టిందని రఘురామ ఫిర్యాదు చేశారు. దాంతో దీనికి సంబంధించిన నివేదిక తెప్పించాలని కేంద్ర హోంశాఖను ఓం బిర్లా ఆదేశించారు. 15 రోజుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి నివేదిక సమర్పించేలా చూడాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.