విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో పెను ప్రమాదం తప్పింది. అప్పన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ నెల 9వ తేదీన సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉంది. గిరి ప్రదక్షిణ కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం శనివారం నాడు భారీ రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు. అయితే పునాదుల్లో కాంక్రీట్ వేయకపోవడంతో షెడ్డు బరువు ఎక్కువై కూలిపోయింది. షెడ్డు కూలిన సమయంలో కింద భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఇదిలా ఉంటే ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన సింహాద్రి అప్పన్న చందనోత్సవం సమయంలోనూ ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈదురుగాలులతో నాసిరకం గోడ కూలిపోయి క్యూలైన్లో ఉన్న భక్తుల మీద పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా.. 15 మంది గాయపడ్డారు.