Jogi Ramesh | ఏపీ లిక్కర్ స్కాంలో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టుపై ఆయన సతీమణి శకుంతల స్పందించారు. నకిలీ మద్యం వ్యవహారంలో తన భర్త పాత్ర ఏమీ లేదని తెలిపారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కావాలనే జోగి రమేశ్‌ను అరెస్టు చేశారని ఆరోపించారు. దుర్గమ్మ సాక్షిగా ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేసినప్పటికీ దౌర్జన్యంగా అరెస్టు చేశారని మండిపడ్డారు.
తన భర్తపై చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కక్ష పెట్టుకున్నారని జోగి శకుంతల అన్నారు. గతంలో అగ్రి గోల్డ్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు కావాలనే నకిలీ మద్యం కేసులో ఇరికించారని అన్నారు. ఇవాళ ఉదయం తమ ఇంటికి వచ్చిన పోలీసులు, తలుపులు మూసేసి దౌర్జన్యంగా వ్యహరించారని అన్నారు. పైన దేవుడు ఉన్నాడని, అందరికీ కుటుంబాలు ఉన్నాయని అన్నారు. అన్నింటినీ దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు.
ఇక జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ మాట్లాడుతూ.. పోలీసులు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. మా నాన్నను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ జరపాలని, మా నాన్నకు లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.