తిరుమల : తిరుమలలో (Tirumala) జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ (TTD) ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకు నలభై రోజులు మాత్రమే ఉండటంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులతో టీటీడీ అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి (Additional EO) సమీక్షా నిర్వహించారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు (Common Devotees) ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్శంగా ప్రోటోకాల్ వీఐపీలు మినహా ఆర్జిత సేవలు, చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. జనవరి 10న స్వర్ణ రథం ఊరేగింపు, 11న చక్ర స్నానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.