అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని వైద్య కళాశాలల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి కోటా సీట్ల కేటాయింపుపై ఏపీ హైకోర్టు (AP High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా సీట్ల కేటాయింపు జీవోను నిలిపివేస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీట్ల కేటాయింపు జీవోను సవాలు చేస్తూ మెడికల్ విద్యార్థులు (Medical Students) దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది.
సీట్టు పెంచకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీట్లు కేటాయిస్తే ఓపెన్ కేటగిరీలో విద్యార్థులకు నష్టం వాటిల్లుతుందని విద్యార్థులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఈ జీవోను నిలుపద చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాకూర్ వాదించారు. పిటిషనర్ వాదనను అంగీకరించినా న్యాయస్థానం జీవోను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఆరు వారాలకు ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
ఈడబ్ల్యూఎస్ కోటాను కేంద్రం 2019లో ప్రవేశపెట్టింది. మొత్తం సీట్లలో పదిశాతం ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కేటాయించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 56 మెడికల్ కాలేజీలుండగా వాటిలో ఐదారు కళాశాలల్లోనే కోటా అమలు చేస్తున్నారు. ఈ జీవో వల్ల యూజీలో 572, పీజీలో 180 సీట్లను ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు నష్టపోయే అవకాశముంది.