Google Data Center | గత పది రోజులుగా ఏపీ అతలాకుతలం అవుతుందని మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అన్నారు. ఓ పక్క రాష్ట్రంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా జరుగుతుంటే.. మరోపక్క వైసీపీ హయాంలో వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. ఈ రెం చ ,చచడు అంశాలను డైవర్ట్ చేయడానికి గూగుల్ డేటా సెంటర్‌ను తెరపైకి తీసుకొస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ హయాంలోనే ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు మొదలయ్యాయని.. మరో రెండు క్లాసులకు సిద్ధం చేశామని సీదిరి అప్పలరాజు తెలిపారు. కానీ అసలు వైసీపీ సమయంలో మెడికల్ కాలేజీలు కట్టలేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పునాదుల దశలో ఉన్న ఫొటోలు చూపించి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టైంలో ప్రారంభం కాకుండానే ఇప్పుడు పీజీ సీట్లు వచ్చాయా అని ప్రశ్నించారు. కూటమి నేతల అబద్ధపు ప్రచారాలను ప్రజలు గుర్తించాలని ప్రజలకు సూచించారు. మెడికల్ కాలేజీలను చూసినప్పుడు జగన్ గుర్తుకురాకుండా ఉండాలనే వాటిని ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలందరూ ఇప్పుడు గూగుల్ గురించే మాట్లాడుతున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. నిజానికి గూగుల్ డేటా సెంటర్ కోసం వైసీపీ హయాంలోనే ఎంవోయూ కుదిరిందని తేల్చిచెప్పారు. గూగుల్ డేటా సెంటర్‌తో పాటు ఎకో సిస్టమ్ క్రియేట్ అయ్యేలా ఎంవోయూ చేసుకున్నామని.. ఇప్పుడు కేవలం డేటా సెంటర్ మాత్రమే వచ్చిందని అన్నారు. ఏమైనా అడిగితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు అంటున్నారని.. నిజంగా సంపద సృష్టిస్తే ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారా అని ప్రశ్నించారు.