Explosion : ఇంట్లో చార్జింగ్ అవుతుండగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ (Scooty battery) ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడు ఘటనలో ఓ 62 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రం కడప జిల్లా (Kadapa district) ఎర్రగుంట్ల (Yerraguntla) మండలంలోని పొట్లదుర్తి (Potladurthi) గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మరణించిన వృద్ధురాలి పేరు వెంకటలక్ష్మమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఇంట్లో బ్యాటరీ చార్జింగ్ పెట్టిన సమయంలో వెంకట లక్ష్మమ్మ ఆ పక్కనే ఉన్న సోఫాలో నిద్రపోతున్నారు. బ్యాటరీ పేలగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు సోఫాకు, ఇంట్లోని ఇతర వస్తువులకు అంటుకున్నాయి.
తీవ్రంగా కాలిన గాయాలతో వెంకటలక్ష్మమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. వెంకట లక్ష్మమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీలు పేలడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో ఎలక్ట్రిక్ స్కూటీల బ్యాటరీలు పేలాయి.