Koneti Adimulam | తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ వచ్చినప్పటి నుంచే తనపై కుట్ర జరిగిందని అన్నారు. ఇదంతా టీడీపీ పేరుతో వైసీపీ చేసిన కుట్ర అని మండిపడ్డారు.
తన వల్ల టీడీపీకి ఎలాంటి నష్టం జరగదని కోనేటి ఆదిమూలం స్పందించారు. ఒక మహిళా నాయకురాలిని అడ్డం పెట్టుకుని తనపై నింద వేశారని కోనేటి ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఈర్ష్య, ద్వేషం, కోపంతో ఈ నింద వేశారని మండిపడ్డారు. ఇది చూసి చాలా బాధ కలిగిస్తోందని అన్నారు. తనపై నింద వేసిన ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
మహిళా నాయకురాలిని లైంగికంగా వేధించి ఉంటే ఆ భగవంతుడే చూసుకుంటాడని కోనేటి ఆదిమూలం అన్నారు. తనకు ఓటు వేసి ఆదరించిన సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు మాత్రమే జవాబుదారీని అని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. తన వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగదని అన్నారు.
తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్లో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశాడని అదే నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి.. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు. తన వద్ద ఇంకా బలమైన సాక్ష్యాలున్నాయని తెలిపారు. కాగా, మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కోనేటి ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది.