Srisailam Temple | శ్రీశైలం : జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహోత్సవాలు శనివారం శాస్త్రోకంగా ప్రారంభమయ్యాయి. ఈవో శ్రీనివాసరావు దంపతులు సాంప్రదాయబద్ధంగా పసుపు,కుంకుమ, పూలు, పండ్లతో ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. అనంతరం లోక కల్యాణం కాంక్షిస్తూ మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏడు రోజుల పాటు పంచాహ్నిక దీక్షతో ఉత్సవాలు ఘనంగా జరగాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను వేడుకున్నారు. అతివృష్టి, అనావృష్టి నివారించబడి పంటలు బాగా పండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని రుత్వికులు శివసంకల్పాన్ని పఠించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మొదట గణపతిపూజ, చండీశ్వర పూజ, కంకణ పూజ, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీప స్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, ప్రధాన కళశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును కనుల పండువగా జరిపారు. ఆ తర్వాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనం, ప్రమదగణాదీశుడైన నందీశ్వరుడి ప్రతిమతోపాటు అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్ని చండీశ్వరస్వామి సమక్షంలో ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. అనంతరం భేరిపూజ జరిపారు. మేళతాళాల రాగాలతో సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తున్నది. ఉత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చే యక్ష గంధర్వ గణాలకు ఆలయ ప్రాంగణంలో నిర్ణీత స్థలాలు కేటాయించి నిత్యోత్సవ పూజలు జరిపిస్తారని ఆలయ స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శ్రీగిరులకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో క్షేత్ర వీధుల్లో సందడిగా మారాయి.
Srisailam
Srisailam
Srisailam