Srisailam | శ్రీశైలం : చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ద్వారాలను మూసివేసిన విషయం తెలిసిందే. గ్రహణం ముగిసిన తర్వాత సోమవారం వేకువ జామున 5 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి భక్తులకు అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2.15 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు స్పర్శ దర్శనాలకు అవకాశం కల్పించారు. రాత్రి 9 గంటలకు రెండో విడత స్పర్శ దర్శనం భక్తులకు అనుమతి ఇచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉభయ దేవాలయాల ద్వారాలు మూసిసే ఉన్నాయి. శాస్త్రోక్తకంగా ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు మహా మంగళహారతి పూజ నిర్వహించారు. భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి అనుమతించారు. ఉదయం నుంచి స్వామి అమ్మవార్ల దర్శనానికి వసతి గృహాల్లో వేచి ఉన్న భక్తులు దర్శనానికి అనుమతించడంతో 7.30 క్యూలైన్లలో భక్తులు అలంకార దర్శనానికి అనుమతి ఇవ్వగా.. ఓం నమశ్శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇకపై ప్రతి రోజులాగానే అన్ని కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన వితరణ పథకానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. కర్నూలుకు చెందిన వీ రాజశేఖర్రెడ్డి రూ.1,00,116, హైదరాబాద్కు చెందిన గాయత్రి రూ.1,00,116 విరాళాలను ఆలయ పర్యవేక్షకులు కే శివప్రసాద్కు అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారల దర్శనాలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి శేష వస్త్రంతో సత్కరించారు.