Polavaram Cofferdam | కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తి కాకముందే అందులో లోపాలు బయటపడుతున్నాయి. ఎగువ కాఫర్ డ్యాంపై మట్టి కుంగింది. పది అడుగుల వెడల్పుతో 7 నుంచి 8 అడుగుల లోతుకు మట్టి జారింది.
శుక్రవారం ఉదయం మట్టి కుంగడం గమనించిన అధికారులు వెంటనే స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన కుంగిన ప్రాంతాన్ని పటిష్టపరిచామని తెలిపారు. కాఫర్ డ్యాం ఎగువనే జారడం తప్ప దిగువ నుంచి ఎలాంటి సమస్య లేదని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు.
Polavaram Cofferdam1
పోలవరం ప్రధాన జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోపు నీటిని మళ్లించేందుకు వీలుగా ఎగువ కాఫర్ డ్యాం నిర్మించారు. 2022 ఆగస్టులో గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు తీవ్ర నష్టం సంభవించింది. దీంతో మరోసారి అలాంటి ప్రమాదం జరగొద్దని ఎగువ కాపర్ డ్యాం వెడల్పు 9 మీటర్లు ఉండేలా.. ఎత్తు మరో 2 మీటర్ల మేర పటిష్టం చేశారు. అలా పైన పెంచిన ప్రాంతంలో ఇప్పుడు కొంచెం మట్టి జారిందని అధికారులు వివరించారు.
పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం వద్ద మట్టి కుంగడం ఇప్పుడు సోషల్‌మీడియాలో చర్చకు దారి తీసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు సాంకేతిక సమస్యతో కుంగితే వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఎస్ఏ అధికారులు.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు.