Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ లవన్న తెలిపారు. శుక్రవారం ఉదయం గ్రామదేవత అంకాలమ్మకు వార పూజల్లో భాగంగా అభిషేకాలు, విశేషార్చనలు జరిపించారు. సాయంత్రం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి వేద పండితులు, అర్చక స్వాములు ప్రీతికరమైన గులాబీ, గన్నేరు, దేవగన్నేరు, నందివర్ధనం, గరుడవర్థనం, మల్లెలు, చామంతులతో పుష్పాలంకరణ చేశారు. అటుపై ఊయలలో స్వామి అమ్మవార్లను వేంచేబు చేసి సేవా మహా సంకల్పాన్ని పఠించారు. అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, లలితా సహస్త్రనామాలతో షోడశోపచార క్రతువులు నిర్వహించారు.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి దాతలు రూ. లక్ష విరాళం ఇచ్చారు. శుక్రవారం ఓంగోలు వాసి ఎం హనుమంతరావు దంపతులు ఆలయ ఏఈవో శ్రీనివాస్ రెడ్డికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్ర్తాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల హుండీలో రూ.3,43,68,091 ఆదాయం వచ్చింది. హుండీకి వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బందితోపాటుశివసేవకులు, ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు.
28 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలు నగదు రూపంలో రూ.3,43,68,091 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 172.400 గ్రాముల బంగారం, 10. 350 కిలోల వెండి ఆభరణాలు, 940 యూఎస్ఏ డాలర్లు, నాలుగు మలేషియా రింగిట్స్, 150 ఆస్ట్రేలియా డాలర్లు, 70 కెనడా డాలర్లు, యూకే ఫౌండ్స్ మొదలైన విదేశీ కరెన్సీని స్వామి అమ్మవార్లకు మొక్కులుగా హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.