తిరుపతి : కార్తీకమాసం సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ధ్యానారామంలో నెలరోజుల పాటు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం అధికారులు వెల్లడించారు. కార్తీకమాసం సందర్భంగా నిన్నటి నుంచి ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆవరణలోని ధ్యానారామంలో రుద్రాభిషేకం ప్రారంభమయ్యింది. ఉమామహేశ్వరస్వామి, బృహదీశ్వర స్వామివార్లకు పంచామృత అభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు.
కార్తీక మాసం ముగిసే వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరిగే రుద్రాభిషేకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర పదకొండు ద్రవ్యాలతో పదకొండు సార్లు రుద్రం, నమక చమక మంత్రసహితంగా అభిషేకించారు. లఘున్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు తెలిపారు.