అమరావతి : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి 6 కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. ప్రపంచాన్ని ఆకర్షించేలా మాన్యుప్యాక్చరింగ్ హబ్ తయారు చేయాలనేది తమ లక్ష్యమని, సుమారు రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులను (Investment) ఆకర్శించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
బుధవారం ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీడియాకు వివరించారు. రూ. 10 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు, 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నియోజకవర్గానికొకటి చొప్పున పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతామని వివరించారు. విశాఖ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా మారబోతుందని స్పష్టం చేశారు.
వచ్చే నెల మొదటి వారంలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తామని ప్రకటించారు. ఏపీలో అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా రాయలసీమ నుంచి ఆదాయం వస్తుందని, సీమలో ప్రతి ఎకరాకు నీళ్లిస్తే అన్ని ప్రాంతాల కంటే మిన్నగా మారుతుందని అన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులు అనుసంధానం చేస్తామని తెలిపారు. వంశధార నుంచి పెన్నా వరకు నదులు అనుసంధానం కావాలని అన్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.