అమరావతి : ఏపీలో మున్నెన్నడు లేని విధంగా చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రజలపై రూ. 15,485 కోట్లు భారం వేసిందని వైసీపీ మాజీ మంత్రులు (YCP Ex Ministers) ఆరోపించారు. ఈనెల 27న కరెంట్ చార్జీలకు వ్యతిరేకంగా వైసీపీ నిర్వహిస్తున్న పోరుబాట పోస్టర్‌ను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు మేరుగ నాగార్జున (Meruga Nagarjuna) , జోగి రమేష్ (Jogi Ramesh) , వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సర్దుబాటు చార్జీల భారం మోపిన కూటమి ప్రభుత్వం అసలు చార్జీల వసూలుకు రంగం సిద్ధం చేసుకుందని మండిపడ్డారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి రానున్నాయని వెల్లడించారు.
గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం లేకుండా టారిఫ్ ఆర్డర్‌ను అమలు చేసిందన్నారు. 2024-25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుంచి అవసరమైన సబ్సిడీ రూ. 13,589.18 కోట్లను వైసీపీ ప్రభుత్వమే భరించి విద్యుత్ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసిందని వివరించారు.