తిరుమల : వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 31 కంపార్టుమెంట్లు (Compartments) నిండిపోయి అతిథి గెస్ట్‌హౌజ్ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం(Sarvadarsan) కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 73,313 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 39,344 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.65 కోట్లు వచ్చిందని తెలిపారు.
ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు
ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం (Snapana Tirumanjanam ) నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.