తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఉన్నాయంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. దీంతో రాజకీయ పార్టీల మధ్య వార్ కొనసాగుతున్నది. తాజాగా శుక్రవారం పలువురు రాజకీయ ప్రముఖులు, నేతలు స్పందించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): వైసీపీ ప్రభుత్వ హయాంలోనే లడ్డూ తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. దేవుడ్ని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అంటూ జగన్ ఆరోపించారు. చంద్రబాబు చెబుతున్నదంతా ఓ కట్టుకథగా అభివర్ణించారు. నెయ్యి శాంపిళ్లపై రెండు నెలల కిందటే నివేదిక వస్తే ఇన్ని రోజులు ఏం చేశారని చంద్రబాబును ప్రశ్నించారు. వందరోజుల పాలన, సూపర్ సిక్స్ హామీల అమలుపై టీడీపీ కూటమిని ప్రజలు ప్రశ్నిస్తారనే చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
నెయ్యి కొనుగోలుకు టీటీడీ 2024 మార్చి 12న టెండర్ వేసినట్లు పేరొంది. మే 8న టెండర్ ఖరారైంది. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీకి ఈ ఆర్డర్ వచ్చింది. కంపెనీ స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో ధర రూ.319గా పేరొన్నది. జూలై 6 – జూలై 12 మధ్య నాలుగు, జూలై 15 నుంచి ఆగస్ట్ 6వ తేదీ వరకు 6ట్యాంకర్లను పంపింది. జూలై 6, 12 తేదీల్లో పంపిన ట్యాంకర్ల నమూనాల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ ల్యాబ్‌కు శాంపిళ్లు పంపి మిగతా ట్యాంకర్లను నిషేధించారు.
తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారు 300 ఏండ్ల కిందటే ప్రారంభమైంది.1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించినట్టు చరిత్ర చెబుతోంది. 2010 వరకూ రోజుకు లక్ష వరకూ లడ్డూలను తయారు చేసేవారు. ఆ తర్వాత భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు 3.20 లక్షల లడ్డూలను తయారుచేస్తున్నారు. లడ్డూకు 2014లో జీఐ గుర్తింపుతోపాటు పేటెంట్, ట్రేడ్మార్ రిజిస్టర్ కావడం విశేషం.