ఎన్టీఆర్ జిల్లా : విజయవాడలోని మాంసం దుకాణాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా కుళ్లిపోయిన మాంసంను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో దాదాపు 500 కేజీల కుళ్లిన మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. గతంలో కూడా వినుకొండలో విక్రయానికి సిద్ధంగా ఉన్న పెద్ద మొత్తంలో కుళ్లిన మాంసంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి రైళ్లో కుళ్లిన మాంసంను తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుళ్లిన మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పలువురు నగర వాసులు అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో మాచవరం, బిఆర్టిఎస్ రోడ్డు, ప్రకాష్‌నగర్, కొత్తపేట మార్కెట్లలో దాడులు జరిపారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాచవరంలో 500 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారిపై కేసు నమోదు చేశారు. విషయం తెలిసి మాంసం ప్రియులు షాక్‌కి గురవుతున్నారు. ఇన్నాళ్లు తాము తిన్న మాంసం మంచిదో కాదో అనే అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
మాంసం కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ వెటర్నరీ సర్జన్ డా.రవిచంద్ర సూచించారు. కుళ్లిన మాంసం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, తద్వారా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. మాంసాన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాతనే కొనుగోలు చేయాలని, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న వారి గురించిన సమాచారాన్ని కార్పొరేషన్ అధికారులకు అందించి సహకరించాలని కోరారు. కుళ్లిన మాంసం విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డబ్బు ఆశతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు నిఘా పెంచాలని వారు కోరుతున్నారు.
గతంలో ఏపీ నుంచి రైళ్లలో ఎగుమతి చేస్తున్న దాదాపు 2 వేల కిలోలకు పైగా కుళ్లిన మాంసాన్ని చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో అక్కడి మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత జూలై నెలలో కృష్ణలంక భూపేష్ నగర్లో రాము అనే వ్యాపారి నిల్వ ఉంచిన మేకలు, పొట్టేళ్ల మాంసాన్ని విక్రయిస్తున్నట్టు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దాంతో దాడులు చేసిన అధికారులు దాదాపు 150 కేజీల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.