పల్నాడు: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో (Visakha Express) దుండగులు చోరీకి యత్నించారు. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు. కాగా, పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర ముఠాలు వరుసగా రైళ్లలో చోరీకి పాల్పడుతున్నాయి. వారంలో రెండు సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు. మరోసారి చోరీకి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు.
విశాఖ ఎక్స్ప్రెస్.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రైలులోకి చొరబడిన దొంగలు ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించారు. రైల్వే పోలీసులు అప్రమత్తమై దుండగులను అడ్డుకున్నారు. గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరపడంతో రైలులోనుంచి దూకి పరారయ్యారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు.