అమరావతి : గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు విద్యార్థులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో పొన్నెకల్లు గ్రామానికి చెందిన నామాల సాయికుమార్(22), నూతక్కి నాగమల్లేశ్వరరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయారు. తాళ్లూరి అజయ్‌కుమార్(22) అనే మరో విద్యార్థికి కాళ్లు విరిగాయి.
ఘటనా స్థలంలో పడి ఉన్న క్షతగాత్రుడిని చూసి అటువైపు వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.