Road Accident : అమెరికా (USA) లో ఉన్నత విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్న సమయంలో ఓ తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఎన్టీఆర్ జిల్లా (NTR District) ఇబ్రహీంపట్నం మండలం (Ibrahim Patnam Mandal) మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న (Atluri Prasanna) న్యూయార్క్ (NewYork) లో జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన జూలై 5న చోటుచేసుకుంది.
ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళుతుండగా మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వారి వాహనం ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ప్రసన్నతోపాటు మరో యువతి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారులో ఉన్న మూడో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రసన్న ఇటీవలే న్యూయార్క్‌లోని పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఆమె ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విధి వక్రించి ప్రమాదం రూపంలో ఆమెను కబళించింది. ప్రసన్న మరణవార్త తెలియడంతో ఆమె స్వగ్రామం మూలపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.