AP News | ఏపీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి పట్టణంలో ఏసీ పేలడంతో విశ్రాంత ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు.
అనకాపల్లి పట్టణానికి చెందిన రేబాక రామారావు తన ఇంట్లో రాత్రి మంచంపై నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఏసీ పేలినట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి మంటలు చెలరేగడంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏసీ పేలడానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
సమ్మర్లో ఏసీ వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏసీలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలని.. లేదంటే.. డస్ట్ బ్లాక్ అవ్వడం వల్ల ఫిల్టర్లలో ప్రెషర్ పెరిగి పేలుతుంటాయని తెలిపారు. అందుకే క్రమం తప్పకుండా ఏసీలకు సర్వీసింగ్ చేయడం అవసరమని సూచించారు.