అమరావతి : వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో (YS Jagan) ఫోన్లో అన్నీ మాట్లాడాకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా (Resignation ) చేశానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ( Vijayasai Reddy ) స్పష్టం చేశారు. త్వరలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నేను ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పనని వెల్లడించారు.
నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ( YS Family) నాకు సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎస్ కుటుంబంలో మూడు తరాలతో నాకు సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. రాజీనామా పూర్తి వ్యక్తిగతమని అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా , పార్టీకి న్యాయం చేయలేనని భావించి రాజీనామా చేశానని వివరించారు. నా స్థానంలో మరొక వ్యక్తి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. వైసీపీకి 11 మంది మాత్రమే సభ్యులున్నారు. తన రాజీనామా కూటమికి లబ్ధి పొందుతుందే తప్పా.. వైసీపీకి లాభం జరగదని అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాకినాడ సీ పోర్టులో బియ్యం తరలింపుపై మొట్టమొదటి కేసు నమోదు చేసి ఏ2గా పేరు చేర్చారని పేర్కొన్నారు. ఇంతవరకు తనపై లుకౌవుట్ నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. వేంకటేశ్వరస్వామి సాక్షిగా కేవీరావుతో ఎలాంటి సన్నిహిత , వ్యాపార లావాదేవిలు లేవని తెలిపారు.
కాకినాడ సీ పోర్టు విషయం తనకు తెలియదు. కేసు పెట్టిన తరువాత అరవిందో అంశం తెలిసిందని, నాపై చేసిన ఆరోపణలు తప్పు అని ఈడీగా చెప్పానని వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసుల నుంచి తప్పించుకోవచ్చననే ప్రశ్నకు సమాధానమిస్తూ ,రాజకీయాల నుంచి తప్పుకుంటే ఇంకా తాను బలహీనపడుతానని, బలవంతుడు కానని అలాంటి సమయంలో తనపై ఉన్న కేసులు ఎందుకు మాఫీ చేస్తారని, కేసుల నుంచి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తులో తాను ఉద్యన పంటల సాగు, గెస్ట్ లెక్చరర్‌గా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.