తిరుమల: తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ తగ్గింది. వరుస వర్షాల కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతుండడంతో భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 5 కంపార్టుమెంట్లలో దర్శనానికి వేచియుండగా టోకెన్లు లేని వారికి 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 57,390 మంది భక్తులు దర్శించుకోగా 20,628 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.45 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
సెప్టెంబరు 6న డయల్ యువర్ ఈవో
డయల్ యువర్ ఈవో కార్యక్రమం రేపు (శుక్రవారం ) మధ్యాహ్నం 2 నుంచి 2.50 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుతో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చని వెల్లడించారు. భక్తులు 0877-2263261 అనే నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని సూచించారు.