Murder case : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్యకు సంబంధించిన కేసును పోలీసులు చేధించారు. ఈ కేసుపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియా సమావేశం నిర్వహించారు. చిన్నారి హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. ఎస్సీ తెలిపిన వివరాల ప్రకారం.. పాప తండ్రి ఓ మహిళకు మూడున్నర లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఆమె అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో దూషించాడు. సివిల్ కోర్టులో కేసు వేస్తానని బెదిరించాడు.
దాంతో ఆమె పాప తండ్రిపై పగ పెంచుకుంది. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న పాపను ఇంటికి తీసుకెళ్లి అన్నం పెట్టింది. అనంతరం ఆమె తన తల్లి, మరో మైనర్ బాలుడితో కలిసి ఆ చిన్నారి ముక్కు, నోరు గట్టిగా మూసి హత్యకు పాల్పడింది. హత్య తర్వాత చిన్నారిని బైక్ పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు. ఈ హత్యకు పాల్పడిన రేష్మను, ఆమె తల్లి హసీనాను, హత్యకు సహకరించిన మైనర్ బాలుడు అఖిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారి మిస్ అయిన రోజునే హత్య చేసి సమ్మర్ స్టోరేజ్‌లో పడేశారు.
చిన్నారి ఒంటిపై ఎలాంటి గాయం లేదని పోలీసులు చెప్పారు. ఘటనపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. చిన్నారి అదృశ్యం అయిందని తెలిసిన వెంటనే దర్యాప్తునకు ఆదేశించానన్నారు. పక్కా ఆధారాలతో పోలీసులు చిన్నారిని హత్య చేసిన నిందితులను పట్టుకున్నారని పేర్కొన్నారు. మీడియాపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొన్ని ఛానెల్స్ చిన్నారి మృతిపై తప్పుడు ప్రచారం చేశాయి. కనీసం నిబంధనలు పాటించకుండా చిన్నారి పేరును, ఫొటోలను ప్రసారం చేశారు. ఇలాంటి విషయాల్లో మీడియా బాధ్యతగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.