అమరావతి : వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ ( YS Jagan Challenge) విసిరారు. 2018లో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు చంద్రబాబు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ -1 పరీక్షలు, 2025లో కూటమి పాలనలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ( CBI ) విచారణకు తాము సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ చాలెంజ్ చేశారు. విచారణకు సిద్ధమైతే సీబీఐకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
తాడేపల్లి నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో ఎలాంటి అవకతవకలు జరుగలేదని చంద్రబాబు వేసిన సిట్ చెప్పిందని, అయినా బాబు ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఏపీపీఎస్సీలో విప్లవాత్మక మార్పులు చేసిన ఘనత తమదేనని అన్నారు.
తమ హయాంలో నిర్వహించిన ఉద్యోగ నియమకాలపై ఎలాంటి ఫిర్యాదులు, అనుమానాలు రాలేదని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటాలో డీఎస్సీ పరీక్ష లేకుండానే పలువురు ఇష్టులకు ఉద్యోగాలిచ్చారని, గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్యకు పోస్టింగ్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తాము తప్పు చేయలేదు కాబట్టే. తల ఎత్తుకుని ప్రశ్నిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై ప్రధాని, హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశామని జగన్ వెల్లడించారు.