విజయవాడ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేట్ బ్యాంకుతోపాటు మరో రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. ఈ బ్యాంకుల్లో నగదు విత్డ్రాయల్స్పై పరిమితులను విధించింది. ఆయా బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. బ్యాకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949 ప్రకారం ఆర్బీఐ ఈ చర్యలకు ఉపక్రమించింది.
విజయవాడలోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్‌తోపాటు బస్మంత్నగర్లోని జైప్రకాశ్ నారాయణ్ నగరి సహకారి బ్యాంకు, సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న కర్మలా అర్బన్ బ్యాంకులు ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోవడంతో వాటిపై విత్‌డ్రా చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు తెలిపింది. ఈ ఆంక్షల కారణంగా ఆయా బ్యాంకుల్లోని కస్టమర్లు తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేసుకోలేరని ఆర్బీఐ ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నది. ఈ బ్యాంకుల్లోని ఖాతాదారులు కేవలం రూ.1.5 లక్షల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఈ ఆంక్షలు ఆరె నెలల వరకు అమలులో ఉండనున్నాయి.
ఆంక్షలు విధించిన ఈ మూడు బ్యాంకులు రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆర్బీఐ తన ఆంక్షలను ఎత్తివేస్తుంది. లేనిపక్షంలో మరికొన్ని రోజులు ఈ ఆంక్షలను పొడగించే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా, ఈ మూడు బ్యాంకులు ఆర్బీఐకి తెలియకుండా రుణాలు ఇవ్వడం గానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం గానీ, డిపాజిట్లు స్వీకరించడంగానీ చేయకూడదు. ఈ పనులు చేయడానికి ఆర్బీఐ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. బ్యాంకు సరైన తీరులో పనిచేయడానికే ఈ ఆంక్షలు విధించామని, ఖాతాదారులు కంగారు చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ తన ప్రకటనలో సూచించింది.