Maha Shivaratri Brahmotsavalu | శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో నయనానందకరంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రావణ వాహనంపై ఆదిదంపతులు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఉత్సవాల్లో ఐదోరోజైన ఆదివారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం తదితర పూజలు చేసినట్లు పేర్కొన్నారు. ఇక సాయంత్రం హోమాలు అనంతరం.. స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన
రావణ వాహనంపై వేంచేబు చేసి.. అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు.
ఆ తర్వాత గ్రామోత్సవం కనుల పండువలా జరిగింది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుంచి బయలు వీరభధ్ర స్వామి వరకు ఆద్యంతంనయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవ నృత్యం, బుట్ట బొమ్మలు, బీరప్పడోలు, నందికోల సేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు, కేరళ చండీమేళం, కొమ్ము కోయ్య నృత్యం, ముంబయి డోలు ప్రదర్శనలతో శోభాయాత్ర వైభవంగా సాగింది. ఆ తర్వాత కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామి అమ్మవార్లకు ఆస్థానసేవ నిర్వహించారు.
రావణ వాహనాధీశుడైన స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న వారు కష్టాల నుంచి వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ఆలయ స్థానాచార్యులుపూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ మాడవీధితో పాటు భ్రామరీ కళావేదికతోపాటు పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భక్తులు తిలకించేందుకు ఏర్పాటు చేసిన కూచిపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు అందరినీ అలరిస్తున్నాయి.
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారలకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ.. శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన చరిత్ర ఉందని.. భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉందన్నారు. రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని.. ఎక్కడ ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేదుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.