Srisailam | శ్రీశైలం : దేవీ శరన్నవరాత్రులు శ్రీశైల క్షేత్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు భ్రమరాంబ అమ్మవారి చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తుల్లో తృతీయ రూపిణి అయిన చంద్రఘంటాదేవి యుద్ధోన్ముఖురాలైసింహవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వగా.. రాత్రి రావణ వాహనసేవపై ఆది దంపతులు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం అమ్మవారికి ప్రాతః కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవవరణార్చనలు, జపానుష్టా పారాయణాలు, చతుర్వేద పారాయణాలు, చండీ, దుర్గ, కాళి, లలితార్చనలు, కుమారి పూజలు చేశారు. అదేవిధంగా స్వామివారికి రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణం జరిపించారు. మధ్యాహ్నకాలార్చన, సహస్రనామార్చన, మహానివేదన అనంతరం సాయంకాలం జపానుష్టానాలు, ప్రధాన అర్చకులు వీరయ్య, మార్కండేయ శర్మలు తెలిపారు.
చంద్రఘంటాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించి అమ్మవారి సింహ మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై అర్చక వేదపండితులు పూజలు నిర్వహించారు. ఈ దేవి పది చేతులతో కుడి వైపు పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలను, ఎడమ వైపు త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. ప్రశాంత వదనంతో శాంతరూపిణిగా ఉన్నప్పటికీ యుద్ధోన్ముఖురాలై ఉంటుంది. ఈ అమ్మవారు తలపై అర్ధ చంద్రుడుని ఘంటాకారంలో ధరించడం వలన ఈ అమ్మవారిని చంద్రఘంటాదేవిగా పిలుస్తారు. అమ్మవారిని పూజించడం వలన భక్తుల కష్టాలు తీరుతాయని, ఈ దేవి ఆరాధన వలన సౌమ్యం, వినమ్రత కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన రావణ వాహనసేవపై ఆసీనులైన స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటా దేవి సమేతుడైన భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు రావణ వాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గ్రామోత్సవంలో భాగంగాఉత్సవ మూర్తులు మయూర వాహనంపై గంగాధర మండపం నుంచి మొదలై.. నంది మండపం మీదుగా బయలు వీరభద్ర స్వామి ఆలయం వరకు సాగింది. గ్రామోత్సవంలో నాదస్వరం, కేరళ చండీ మేళం, కొముకోయ నృత్యం, థయ్యం, విళక్కు, స్వాగత నృత్యాలు, కోలాటం, వేషధారణలు, అశ్వ ప్రదర్శన, ఢమరుకం, చిడతలు, శంఖం, పిల్లన గ్రోవి, త్రిశూలం, జేగంట, కంచుడోలు, కొమ్ము, తాళాలు, చెక్కభజన, డోలు విన్యాసం, వీరభద్రడోలు కుణిత కన్నడ జానపదాలు ఆధ్యాంతం కనుల పండువగా సాగింది. ఉత్సవం తర్వాత సువాసిని పూజ, కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు తీర్థప్రసాద వితరణ ఆది దంపతులకు ఆస్థానసేవ జరిపించారు. కార్యక్రమంలో ఈఓ పెద్దిరాజు, పీఆర్వో శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, హర్యానాయక్ ఉన్నారు. అదే విధంగా ఆలయ దక్షిణ మాడవీధిలో కళారాధన సాంస్కతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు.